పార్వతీపురం – కురుపాం: ప్రకృతి వ్యవసాయంపై గిరిజన రైతులు అవగాహన పెంచుకోవాలని, అలాగే వీలైనంత వరకు సేంద్రియ ఎరువులను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ రైతులకు పిలుపునిచ్చారు. కురుపాం మండలంలోని ఉదయపురం గ్రామాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. అక్కడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధిక మోతాదులో ఎరువుల వినియోగం వలన పంటకు, ఆరోగ్యానికి హానికరమని అన్నారు. కావున నిర్దేశించిన మోతాదులోనే యూరియాను వినియోగించాలని, ఈ విషయాన్ని రైతులు గ్రహించాలని సూచించారు. అధిక యూరియా వినియోగానికి బదులుగా నానో మరియు ఇతర జీవన ఎరువులను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. నానో యూరియా, డిఏపిని వినియోగించడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించవచ్చని తెలిపారు. నానో యూరియా, డిఏపి అందరికీ అందుబాటులో ఉన్నాయని, అవసరం మేరకు వాటిని వినియోగించాలని రైతులను కోరారు. ఈ సందర్బంగా నానో యూరియా, డిఏపిని రైతులకు కలెక్టర్ పంపిణీ చేశారు. అనంతరం అదే గ్రామంలోని ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఆయన అక్కడి విద్యార్థినులతో ముచ్చటించారు. కాసేపు అధ్యాపకుడుగా మారి విద్యార్థులకు పాఠ్యంశాలను బోధించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని అధ్యాపకులను ఆదేశించారు. పాఠశాలలో మౌలిక వసతులు లోటు ఉండరాదని, ఎల్లవేళలా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అక్కడి నుండి గుమ్మా గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. వ్యాధులు రాకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యలు గురించి వివరించారు. ఈ సందర్బంగా శిబిరానికి విచ్చేసిన రోగులకు కాల్షియమ్, ఇతర టాబ్లెట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. తదుపరి మొండెంకల్లులో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను, మందులను పరిశీలించి, రోగులకు మంచి సేవలు అందించాలని వైద్యులను కోరారు. తదుపరి ఆ గ్రామంలోని చెరువును పరిశీలించి ఆర్.ఆర్.ఆర్ కింద జంగిల్ క్లియరెన్స్ చేసి, ఆదర్శవంతమైన చెరువుగా దీన్ని తీర్చిదిద్దాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కురుపాంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు తోయక జగదీశ్వరితో కలిసి ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి పలు సూచనలు, మార్గదర్శకాలు జారీచేశారు.
ఈ పర్యటనలో జిల్లా లెప్రోసి, ఎయిడ్స్, హెచ్.ఐ.వి మరియు టిబి నియంత్రణ అధికారి డా. ఎం.వినోద్ కుమార్, ప్రత్యేక ఉప కలెక్టర్ డా. పి.ధర్మచంద్రా రెడ్ది, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.జగదీశ్వర రావు, ఇతర వైద్యాధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, ఉపాధ్యాయులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.