పార్వతీపురం : జిల్లాలో ఎక్కడా డోలీ మోతలు లేకుండా చూడాలని, రహదారి సౌకర్యం లేని మారుమూల గ్రామాలకు యుద్ధప్రాతిపదికన రోడ్లు వేయాలని జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికీ డోలీ మోతలు కొనసాగడం బాధాకరమని, అటువంటి పరిస్థితులకు శాశ్వతంగా స్వస్తి పలకాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నాడు గిరిజన ప్రాంతాల్లో రహదారుల సౌకర్యంపై జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి తో కలిసి కలెక్టర్ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, ఇతర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
264 గ్రామాలకు అత్యధిక ప్రాధాన్యత..
గిరిజన ప్రాంతంలో గల ఏడు మండలాలైన కొమరాడ, పాచిపెంట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, భామిని, సీతంపేట మరియు జియ్యమ్మవలసలలో మొత్తం 264 గ్రామాలను రహదారి సౌకర్యం లేనివిగా గుర్తించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ఈ 264 గ్రామాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ, ఇంజినీరింగ్ అధికారులు వీలైనంత త్వరగా రహదారి సౌకర్యం కల్పించాలి. ఈ పనులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిన్ఆర్ఈజిస్) లో భాగంగా చేపట్టే వెసులుబాటు ఉంది,” అని కలెక్టర్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో బృందాలు పరిశీలించి, డోలీ మోతలు లేకుండా రహదారి సౌకర్యం కల్పించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పథక సంచాలకులు కె. రామచంద్రరావు, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.