హాంకాంగ్‌లో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన క్వారీ బేలో రెండో ప్రపంచ యుద్ధం నాటి భారీ బాంబు ఒకటి బయటపడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సుమారు 6,000 మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, క్వారీ బే ప్రాంతంలో శుక్రవారం రాత్రి నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరుపుతుండగా ఈ బాంబు బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది 1.5 మీటర్ల పొడవు, 450 కిలోగ్రాముల (వెయ్యి పౌండ్లు) బరువున్న అమెరికన్ బాంబు అని గుర్తించారు.
“ఇది రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు అని నిర్ధారించాం. దీనిని నిర్వీర్యం చేసే ప్రక్రియ చాలా ప్రమాదకరమైనది కావడంతో, ముందుజాగ్రత్త చర్యగా 1,900 ఇళ్లలోని దాదాపు 6,000 మందిని ఖాళీ చేయించాం” అని సీనియర్ పోలీసు అధికారి ఆండీ చాన్ టిన్-చు మీడియాకు తెలిపారు. శుక్రవారం రాత్రి మొదలైన ఈ ఆపరేషన్, శనివారం మధ్యాహ్నం 11:30 గంటలకు ముగిసింది. బాంబు నిర్వీర్య దళం గంటల తరబడి శ్రమించి, బాంబును విజయవంతంగా నిర్వీర్యం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ ఆక్రమణలో ఉన్న హాంకాంగ్‌పై మిత్రదేశాల దళాలు భారీగా వైమానిక దాడులు చేశాయి. ఆ సమయంలో పేలకుండా భూమిలో కూరుకుపోయిన బాంబులు ఇప్పటికీ నిర్మాణ పనుల సమయంలో తరచూ బయటపడుతుండటం గమనార్హం. 2018లో కూడా వాన్ చై ప్రాంతంలో ఇలాంటి బాంబునే కనుగొన్నారు.