- కురుపాం గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ పనులు పూర్తి చేసి, తరగతులు వెంటనే ప్రారంభించాలి:
- సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు.
పార్వతీపురం జిల్లా – కురుపాం మండలం: కురుపాం వద్ద నిర్మాణంలో ఉన్న గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ పనులను ఆదివారం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు గిరిజనులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గంగు నాయుడు మాట్లాడుతూ, కాలేజీ పనులు ప్రారంభించి ఐదేళ్లు అవుతున్నా పూర్తి చేయకపోవడం గిరిజన విద్యార్థులకు అన్యాయం చేయడమేనని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పనులు పూర్తి చేసి, తరగతులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
అలాగే, కాలేజీకి భూములు ఇచ్చిన టేకరికండి, చంద్రశేఖర్ రాజపురం గిరిజన నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం (కంపెన్సేషన్) మరియు ఆర్ & ఆర్ (R&R) ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఈ విషయంలో పోరాటం చేసి, అరెస్ట్ అయిన ప్రస్తుత ఎమ్మెల్యే తొయక జగదీశ్వరి, ఇప్పుడు గిరిజనులకు న్యాయం చేయడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రికి ఇచ్చిన మెమొరాండంలో కూడా నష్టపరిహారం గురించి ప్రస్తావించకపోవడంపై గంగు నాయుడు ప్రశ్నించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే జగదీశ్వరి దీనిపై దృష్టి సారించి, నష్టపరిహారం ఇప్పించాలని, లేకపోతే రానున్న కాలంలో మలివిడత పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కూరంగి సీతారాం, గిరిజన నిర్వాసితులు పాల్గొన్నారు.