కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి – ఖాజీపూర్ గ్రామాల మధ్యగల మానేరు వాగుపై వంతెన నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.77 కోట్ల రూపాయలు మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా ఆయన చిత్రపటానికి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బుధవారం ఎల్ ఎం డీ కాలనీలోని ప్రజాభవన్ లో పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ చొక్కారావుపల్లి – ఖాజీపూర్ గ్రామాల మధ్య మానేరు వాగుపై వంతెన నిర్మాణం కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న గన్నేరువరం మండల వాసుల కోరిక కేంద్రం నిధులు మంజూరుతో ఎట్టకేలకు తీరనున్నదన్నారు. వంతెన నిర్మాణానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడమే కాకుండా నిదుల మంజూరు కోసం సంబంధితశాఖ మంత్రి నితిన్ గడ్కరీని పలుమార్లు సంప్రదించారన్నారు. అలాగే కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా వంతెన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయించడానికి గట్టి కృషి చేశారని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి కొనియాడారు. బండి సంజయ్ కుమార్, రేవంత్ రెడ్డి ల కృషి వల్లనే వంతెన నిర్మాణానికి కేంద్రం 77 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని పేర్కొంటూ వారిద్దరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి,పార్టీ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డితోపాటు చొక్కారావుపేట గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
