జమ్మూ కాశ్మీర్ : లడఖ్‌లో రాష్ట్ర హోదా డిమాండ్‌తో బుధవారం నిరసనలు వెల్లువెత్తాయి. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లెహ్ నగరంలో భారీ సంఖ్యలో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో రాళ్లు రువ్వడం జరిగింది, దీంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి, లాఠీఛార్జ్ చేయవలసి వచ్చింది. లెహ్‌లోని బీజేపీ కార్యాలయానికి, పోలీసు వాహనాలకు నిరసనకారులు నిప్పు అంటించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత నుంచి రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన భద్రతలు కల్పించాలనే డిమాండ్‌తో ఆందోళనకారులు లెహ్ వీధుల్లోకి వచ్చారు. రాష్ట్ర హోదా డిమాండ్ నెరవేరే వరకు నిరాహార దీక్ష చేస్తామని లెహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ) ప్రకటించింది. రాష్ట్ర ఏర్పాటు కోసం లెహ్ అపెక్స్ బాడీ సెప్టెంబర్ 10 నుండి నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. ప్రజల డిమాండ్లపై చర్చించేందుకు లడక్ ప్రతినిధులు అక్టోబర్ 6న సమావేశానికి రావాలని కేంద్రం ఆహ్వానించిన నేపథ్యంలో ఈ ఆందోళనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, రాష్ట్ర హోదా కోసం పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ రెండు వారాలుగా నిరసన దీక్ష చేస్తున్నారు. లడక్‌ను ఆరో షెడ్యూల్ కింద చేర్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
