పల్నాడు జిల్లా – పిడుగురాళ్ల : పల్నాడు జిల్లా పిడుగురాళ్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈరోజు ఉదయం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రజాసంఘాల నేతలు, వామపక్షాలు, దళిత సంఘాలు ఆందోళన కార్యక్రమం నిర్వహించాయి. దళిత యువకుడు వర్ల సాగర్ బాబుకు జరిగిన అన్యాయంపై స్పందనగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. అనంతరం అధికారులకు మెమోరాండం అందజేశారు.
విద్యుత్ అధికారుల వల్ల సాగర్ బాబు దుస్థితి
ఈ సందర్భంగా వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ కారంపూడి మండలం పెదకోదమగుండ్ల గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి రథోత్సవం జరుగుతుంటే 11 కేవీ విద్యుత్ తీగలు అడ్డుగా ఉన్నయని వాటిని తొలగించాలని ప్రైవేటుగా కరెంటు పనులు చేసుకుని జీవిస్తున్నటువంటి సాగర్ బాబుని బలవంతంగా స్థంభంపై ఎక్కించి కరెంటు కనెక్షన్ ఆపకుండా ఉండడంతో షాక్ కొట్టి స్తంభం పై నుండి కిందపడి కాళ్ళు చేతులు కోల్పోయి వికలాంగుడిగా మారాడు ఈ స్థితికి కారణమైన లైన్మెన్ యం. వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ లైన్మెన్ పరబ్రహ్మచారి, లైన్ ఇన్స్పెక్టర్, ఏఇ లపై చర్యలు తీసుకోవాలని వివిధ రకాల అధికారులకు తెలియజేసి చివరకు బాధిత కుటుంబం తన అత్తగారు ఊరైన చేజర్లలో దీక్షలు చేస్తున్నారని విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకొని దళితుడైన సాగర బాబుకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
13 రోజులుగా దీక్షలో సాగర్ బాబు కుటుంబం
ఈ సంఘటనలో న్యాయం లభించకపోవడంతో సాగర్ బాబు కుటుంబం నకరికల్లు మండలం చేజర్లలో గత 13 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టింది. దీనికి మద్దతుగా ఈరోజు పిడుగురాళ్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
నేతల డిమాండ్లు:
బాధ్యత వహించిన విద్యుత్ శాఖ అధికారులపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
సాగర్ బాబుకు పూర్తి న్యాయం కల్పించాలి
ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి పూర్తి మద్దతు ఇవ్వాలి
ఈ నిరసనలో సీపీఎం మండల కార్యదర్శి శీను, సీపీఐ పట్టణ కార్యదర్శి బాలయ్య, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి ఓర్స్ కృష్ణ, అంబేద్కర్ ప్రసార సమితి అధ్యక్షుడు అబ్రహాం, మాల మహానాడు నాయకులు గోదా బాల, చిట్టిమల్ల మేరీ, ఆర్టీఐ కార్యదర్షి కే. కుమార్, పిడిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె. శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్వలి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
అధికారులకి హెచ్చరిక:
“ఇది సామాన్య ఘటన కాదని, దళితులపై జరుగుతున్న అన్యాయానికి ఇది ఒక ఉదాహరణ. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని వేగవంతం చేస్తామని” నేతలు హెచ్చరించారు.