కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మహిళా పోలీసు సిబ్బంది మరియు అధికారుల ఆత్మస్థైర్యాన్ని, వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంపొందించేందుకు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఘనంగా మహిళా పోలీస్ కాన్ఫరెన్స్ జరిగింది.
‘సేఫ్ హాండ్స్ విత్ తెలంగాణ పోలీస్ – నారి శక్తి ఇన్ కరీంనగర్ పోలీస్ కమీషనరేట్’ అనే ముఖ్య ఉద్దేశ్యంతో కమీషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్ హాలు నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలీసు కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన మూడు రోజుల మహిళా నారీ శక్తి కార్యక్రమ సారాంశాన్ని జిల్లాలు మరియు కమీషనరేట్లలో కూడా అమలు చేసేందుకు ఈ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. “పోలీసు శాఖలో 33 శాతం మహిళా నియామకాలు జరుగుతుండడం వలన, బాధిత మహిళలకు మహిళా పోలీసులు అందుబాటులో ఉండటం ద్వారా వారికి మరింత ఆత్మస్థైర్యం లభిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
విజిబుల్ పోలీసింగ్‌లో మహిళా భాగస్వామ్యం పెంపు
ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం విజిబుల్ పోలీసింగ్‌లో మహిళా పోలీసుల భాగస్వామ్యాన్ని పెంపొందించడమేనని సీపీ తెలిపారు. దీనిలో భాగంగా మహిళా పోలీసులను బీట్ పెట్రోలింగ్, వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ధర్నాలు, రాస్తా రోకోలు వంటి శాంతి భద్రతల విధులతో పాటు, డయల్ 100 కాల్స్ అటెండ్ చేయడంలో మరింత క్రియాశీలంగా భాగస్వామ్యం చేస్తామన్నారు. అలాగే, మహిళా పోలీసులు నిత్యం వారి విధుల్లో ఎదురయ్యే సమస్యలు, సందేహాలను అనుభవజ్ఞులైన అధికారులచేత నివృత్తి చేసి వారి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి ఈ కార్యకరం దోహదపడుతుందని తెలిపారు.
సీపీఆర్ శిక్షణ మరియు ఇతర అంశాలపై అవగాహన
ఈ కార్యక్రమంలో భాగంగా, ఐ.ఎన్.ఏ. కరీంనగర్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేష్ మరియు వారి బృందం ఆధ్వర్యంలో మహిళా పోలీసులకు అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడే సీపీఆర్(Cardiopulmonary Resuscitation) శిక్షణ అందించారు. క్షేత్ర స్థాయిలో ఉండే పోలీసులు ఫస్ట్ రెస్పాండర్స్గా ఉంటారు కాబట్టి, సీపీఆర్‌పై అవగాహన ఉండటం వలన అనేక ప్రాణాలను కాపాడవచ్చని సీపీ తెలిపారు.
అంతేకాకుండా, ఈ కాన్ఫరెన్స్‌లో POSH (Prevention of Sexual Harassment) చట్టం, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు వంటి ముఖ్య అంశాలపై మహిళా పోలీసులకు విస్తృతమైన అవగాహన మరియు శిక్షణ కల్పించారు.
ఈ కాన్ఫరెన్స్ మహిళా పోలీసుల వృత్తిపరమైన ఎదుగుదలకు, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపకరిస్తుందని పోలీస్ కమీషనర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ (పరిపాలన), భీంరావు (ఏ.ఆర్.), ఏసీపీలు మాధవి, యాదగిరిస్వామి, శ్రీనివాస్ జి , వెంకట స్వామి, ఇన్‌స్పెక్టర్లు శ్రీలత , ఫింగర్ ప్రింట్స్ ఇన్స్పెక్టర్ స్వర్ణ జ్యోతి లతో పాటు రిజర్వు ఇన్స్పెక్టర్లు రజినీకాంత్ , కిరణ్ మరియు కమీషనరేటులోని మహిళా పోలీసు సిబ్బంది ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.