హైదరాబాద్ : దసరా పండుగ సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుండి ప్రజలు పెద్ద ఎత్తున తమ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు వెళ్తున్న ప్రయాణికులతో రహదారి కిక్కిరిసిపోయింది.
ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రయాణ సమయం పెరిగిపోతోంది. చౌటుప్పల్, పెద్దకాపర్తి, చిట్యాల వంటి ప్రాంతాల్లోనూ అధిక రద్దీ కనిపిస్తోంది. సొంత కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో ప్రజలు భారీగా బయలుదేరడమే ఈ రద్దీకి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
మరోవైపు, నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ కోసం ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ, ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో బస్టాండ్లన్నీ జనంతో నిండిపోయాయి. సొంత వాహనాల్లో వెళ్లేవారు, బస్సుల్లో ప్రయాణించేవారితో హైదరాబాద్ నుంచి బయటకు వెళ్లే అన్ని మార్గాల్లోనూ పండుగ సందడితో పాటు ట్రాఫిక్ రద్దీ నెలకొంది.