హైదరాబాద్‌లో గురువారం రాత్రి నుండి కురిసిన వర్షంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత భారీ వరద మూసీని ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి. ఎంజీబీఎస్ వద్ద మూసీలో ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహిస్తోంది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఎంజీబీఎస్‌లోకి వరద వెళ్తోంది. బాపూ ఘాట్ నుంచి దిగువ ప్రాంతాలను ముంచెత్తుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్ వంతెన వద్ద 13 అడుగుల మేర ప్రమాదకరంగా మూసీ నది ప్రవహం ఉంది. దీంతో దాని పరిసర ప్రాంతాలు నీట మునిగాయి.
ఎంజీబీఎస్ బస్టాండ్‌కు వచ్చే రెండు వంతెనల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఎంజీబీఎస్‌ను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. మరోవైపు చాదర్‌ఘాట్ వద్ద చిన్న వంతెనపై వరద ప్రమాదకరంగా ప్రవహించడంతో ఆ వంతెనను మూసేశారు. చిన్న వంతెన మూసివేయడంతో పెద్ద వంతెనపైనే రాకపోకలు కొనసాగుతున్నాయి. దీంతో చాదర్‌ఘాట్ పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది.
మూసారాంబాగ్ వద్ద మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో అంబర్పేట్ నుంచి దిల్సుఖ్నగర్ వెళ్లే ప్రధాన రహదారిని అధికారులు మూసేశారు. మూసారాంబాగ్ పాత వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. నిర్మాణంలో ఉన్న వంతెనను కూడా తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో వరద నీటిలో కొంత వంతెన నిర్మాణ సామగ్రి కొట్టుకుపోయింది. క్రమక్రమంగా మూసీ నది ప్రవాహం అనేది పెరుగుతూ ఉంటుంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
MGBS వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు : మూసీ ప్రవాహానికి ఎంజీబీఎస్,గౌలిగూడ రహదారులు జలమయమయ్యాయి. రెండు వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహించడంతో ఎంజీబీఎస్‌కు వచ్చే ప్రయాణికులు, అటువైపు వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటితో రహదారులు ఏరులైపారుతున్నాయి. తాడు సహాయంతో వరద నీటిలో చిక్కుకున్న ప్రయాణికులను పోలీసులు బయటకు తీసుకొస్తున్నారు.
నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది పరివాహక ప్రాంతంలోని సౌత్ జోన్ పరిధిలో ఆరు ప్రాంతాల్లోని సుమారు 1000 మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మూసారాంబాగ్ ముంపు ప్రాంతాల్లో చార్మినార్ జోన్ జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీనివాసర్ రెడ్డి పర్యటించారు. మూసీపై ఉన్న బ్రిడ్జి నీట మునగడంతో ఆయన పరిశీలించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్తు, పోలీసులు, ట్రాఫిక్ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని ఆయన తెలిపారు. వికారాబాద్ జిల్లా నుంచి వస్తున్న వరద కారణంగా మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోందని వివరించారు.
మూసీ నదిలో చిక్కుకున్న పూజారి కుటుంబం : మూసీలో అకస్మాత్తుగా వరద పెరగడంతో పురానాపూల్ వద్ద శివాలయంలో ఓ పూజారి కుటుంబం చిక్కుకుంది. దీంతో మూసీ నది మధ్యలోనే ఆలయంలో నలుగు వ్యక్తులు ఉండిపోయారు. పూజారి కుటుంబాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు, అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.