తిరుపతి జిల్లాలో పాకాల మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోపలికి అనారోగ్యంతో ఎవరైనా అడుగు పెడితే మహా గొప్పగా హాస్పిటాలిటీ వుంది అని ఫీల్ అవుతారు. కానీ అక్కడ నెలకొని ఉన్న అనారోగ్య వాతావరణం కొంత సేపటికి అర్థమయ్యాక, రోగులు అక్కడి నుండి ఎంత తొందరగా బయట పడదామా అని టెన్షన్ పడతారు. ఎందుకు ఈ దుస్థితి, ఏమిటి ఈ పరిస్థితి అని కొంచెం ఆరా తీస్తే బయటపడ్డ విషయాలు విస్మయాన్ని కలిగించక మానవు.
వివరాల్లోకి వెళితే, పేరుకి పాకాల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రమైనా, లోపలికి వెళ్ళగానే ఇదేదో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కు వచ్చినట్లుగా ఉంటుంది. పి హెచ్ సి లో పనిచేసే సిబ్బంది వివరాల పట్టికను చూస్తే పేషెంట్ కు ఒక్క సారిగా భరోసా ఏర్పడుతుంది. నాకు తగిన వైద్యం దొరుకుతుంది అనిపిస్తుంది. సరిగ్గా ఇక్కడే సదరు పేషెంట్ తప్పులో కాలేసాం అని అనిపిస్తుంది. ఆ సదరు సిబ్బంది తాలూకు పట్టికను చూసాక… ఎందు కంటే అందులో ఉన్న వివరాలు, అక్కడున్న వాస్తవ పరిస్థితులను చూసాక పేషెంట్ యొక్క బి పి పెరిగి, షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు, లేదా పెరిగిపోవచ్చు. తిరుపతి జిల్లాలో 27 వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా గుర్తింపు ఉన్న ఈ కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ 1, 2, సి హెచ్ ఓ/ఎంపీహెచ్ఓ, పి హెచ్ ఎన్/హెచ్ఈ, ఎంపీహెచ్ఎస్(ఏఫ్), ఎంపీహెచ్ఎస్(ఎం), స్టాఫ్ నర్స్ 1& 2,3, సీనియర్ అసిస్టెంట్/ జూనియర్ అసిస్టెంట్/ఎల్ సి డి, ల్యాబ్ టెక్నీషియన్, గ్రేడ్ II, ఫార్మాసిస్ట్ గ్రేడ్ II, ఎఫ్ ఎన్ ఓ/ ఎం ఎన్ ఓ, సానిటరీ అటెండర్ కమ్ వాచ్మాన్/ఓఏస్ ఇలా 14 రకాలైన సిబ్బంది ఉన్నట్లుగా పట్టిక చూపుతుంది. వాస్తవంగా పరిశీలిస్తే అక్కడెవరు అంత మంది సిబ్బంది ఉన్నట్లుగా కనపడదు. అంతా ప్రశాంతంగా ఉంటుంది. హాస్పిటాలిటీగా ఒక డాక్టర్ ఉంటాడు ఓ పి స్లిప్ వ్రాయడానికి, ఒక నర్స్ ఉంటుంది. అంతే అన్నింటికీ ఆమె అల్ ఇన్ వన్ మిగతా 12 మంది సిబ్బంది వెతికినా కనపడరు. అక్కడ ఉన్న సిబ్బందిని అడిగితే మేము వున్నాము కదా అందుకు సంతోషించండి అన్నట్లుగా ఉంటుంది వారి సమాధానం. ఇక వైద్యం మాటకు వస్తే, అరకొర గానే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. తిరిగి వెళుతున్న పేషెంట్ లను పలుకరిస్తే, ముందుగా ఈ ఆరోగ్య కేంద్రానికి ప్రాథమిక చికిత్సను అందించండి మహాప్రభో… ఆరోగ్య కేంద్రమే అనారోగ్యం పాలయ్యింది అని వాపోతున్నారు.











