- ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ఆశీస్సులతో బాధ్యతలు
కురుపాం/కొమరాడ : కురుపాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ లో కీలక నియామకం జరిగింది. కొమరాడ మండల టీడీపీ నూతన అధ్యక్షుడిగా ఎస్. ఉదయ్ శేఖర్ పాత్రుడు నియమితులయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో, రాష్ట్ర ప్రభుత్వం విప్, కురుపాం నియోజకవర్గ శాసనసభ్యులు తోయక జగదీశ్వరి సూచనల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఎస్. ఉదయ్ శేఖర్ పాత్రుడు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, మర్యాదపూర్వకంగా కలిశారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఉదయ్ శేఖర్ పాత్రుడికి దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, కొమరాడ మండలంలో పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేయడంలో భాగంగా ఉదయ్ శేఖర్ పాత్రుడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. యువ నాయకత్వం ద్వారా మండలంలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ నియామకం పట్ల కొమరాడ మండలంతో పాటు కురుపాం నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.