contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

భారత్ కి తాలిబన్ మంత్రి… పాక్‌కు చెక్ పెడుతున్న భారత్!

ఢిల్లీ : దక్షిణాసియా రాజకీయ సమీకరణాలను మార్చేసే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆఫ్ఘ‌నిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఈ నెల‌ 9న భారత పర్యటనకు రానున్నారు. 2021 ఆగస్టులో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఆఫ్ఘ‌న్ నుంచి ఓ ఉన్నతస్థాయి నేత భారత్‌కు రావడం ఇదే ప్రప్రథమం. ఈ పర్యటన భారత్-తాలిబన్ల మధ్య కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని, అదే సమయంలో పాకిస్థాన్‌కు దౌత్యపరంగా గట్టి ఎదురుదెబ్బ అని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ముత్తాఖీ పర్యటనకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సైతం ఆమోదం తెలిపింది. ఆయనపై ఉన్న అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల నుంచి తాత్కాలికంగా మినహాయింపునిచ్చింది. దీంతో ఆయన ఈ నెల‌ 9 నుంచి 16 వరకు ఢిల్లీలో పర్యటించనున్నారు. 10న ఇరు దేశాల మధ్య కీలక ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఈ పర్యటన కోసం గత జనవరి నుంచే భారత అధికారులు తెర వెనుక చర్చలు జరుపుతున్నారు. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, సీనియర్ అధికారి జేపీ సింగ్ వంటి వారు దుబాయ్ వంటి వేదికల్లో ముత్తాఖీతో పలుమార్లు సమావేశమయ్యారు.

పాకిస్థాన్‌పై భారత్ జరిపిన ‘ఆపరేషన్ సిందూర్‌’కు తాలిబన్లు మద్దతు పలకడం ఇరు దేశాల మధ్య సంబంధాల్లో కీలక మలుపుగా చెప్పవచ్చు. ఆ తర్వాత మే 15న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ముత్తాఖీతో ఫోన్‌లో మాట్లాడారు. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడాన్ని జైశంకర్ అభినందించారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్, ఆఫ్ఘ‌నిస్థాన్ ఒకే మాటపై ఉన్నాయని ఈ ఘటన స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే భారత్ ఆఫ్ఘ‌న్‌కు మానవతా సాయాన్ని మరింత పెంచింది.

ఇటీవల ఆఫ్ఘ‌నిస్థాన్‌లో సంభవించిన భూకంపం సమయంలో స్పందించిన దేశాల్లో భారత్ ఒకటి. సుమారు 1000 టెంట్లు, 15 టన్నుల ఆహార సామాగ్రితో పాటు 21 టన్నుల మందులు, జనరేటర్లు వంటి అత్యవసర వస్తువులను పంపింది. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారత్ సుమారు 50,000 టన్నుల గోధుమలు, 330 టన్నులకు పైగా మందులు, వ్యాక్సిన్లు అందించి ఆ దేశ‌ ప్రజలకు అండగా నిలుస్తోంది.

కొంతకాలంగా పాకిస్థాన్ తమ దేశంలోని 80,000 మందికి పైగా ఆఫ్ఘ‌న్ శరణార్థులను వెనక్కి పంపేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ అవకాశాన్ని భారత్ ఉపయోగించుకుంది. ఆఫ్ఘ‌న్‌తో నేరుగా సంబంధాలు పెట్టుకోవడం ద్వారా ఆ దేశంలో చైనా, పాకిస్థాన్‌ల ప్రభావాన్ని తగ్గించి, తన ప్రయోజనాలను కాపాడుకోవాలని భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముత్తాఖీ పర్యటన ఈ దిశగా వేస్తున్న అతిపెద్ద ముందడుగు అని చెప్పవచ్చు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :