- సందర్శించిన సబ్ కలెక్టర్ పవర్ స్వప్నల్ జగన్నాథ్ .. స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి
ఆంధ్రప్రదేశ్ – పార్వతీపురం మన్యం జిల్లా : పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గం పరిధిలోని తోటపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామమైన బాసంగి గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా ముంపునకు గురైంది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు ఉదయం రిపోర్టర్ టివి ప్రచురించిన కథనానికి జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి స్పందించారు. ఎమ్మెల్యే ముంపు ప్రాంతమైన బాసింగి ని సందర్శించారు. వారి సమస్యలు అడిగితెలుసుకుని వారికి తగు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తక్షణమే స్పందించి, సబ్ కలెక్టర్ పవర్ స్వప్నల్ జగన్నాథ్ వెంటనే ముంపునకు గురైన గ్రామాన్ని సందర్శించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బాసంగి గ్రామాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్, పరిస్థితిని సమీక్షించారు.
గ్రామస్తుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, ముంపునకు గురైన బాధితులను ఎటువంటి ఆలస్యం చేయకుండా, సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని, అంతేకాకుండా, సురక్షిత ప్రాంతానికి తరలించిన వారికి అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులను, ప్రాథమిక సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.