గుత్తి (అనంతపురం జిల్లా) : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి పై సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడు రాకేష్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విస్తృత స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పలువురు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు సంఘటితమై ఆందోళన తెలిపారు.
రాకేష్ తనకు ఉన్న స్థానం, హోదా మరిచిపోతూ దేశ అత్యున్నత న్యాయస్థానం అధిపతి గవాయిని బూటుతో కొట్టే ప్రయత్నం చేయడం హేయమైన చర్యగా అన్ని వర్గాలవారు పేర్కొన్నారు. ఈ చర్యను సనాతన ధర్మం పేరుతో సామాజిక న్యాయాన్ని కించపరిచే కుట్రగా అభివర్ణించారు.
“ఇది వ్యక్తిగత దాడి కాదు, ఇది వ్యవస్థపైనే దాడి. ప్రధాన న్యాయమూర్తి అవమానానికి పాల్పడిన రాకేష్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు మొదలవుతాయి,” అని ఆందోళనకారులు హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో బహుజన సమాజ్ వాది పార్టీ, భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), ఎమ్మార్పీఎస్, కులవివక్ష పోరాట సమితి తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా జి. రామదాసు, షఫీ, విజయ్, మల్లికార్జున, రామాంజనేయులు, అడవి రాముడు, రమేష్, వెంకట్ రాముడు వంటి నాయకులు ప్రసంగిస్తూ సంఘ వ్యవస్థల పరిరక్షణకు ప్రజలు గళమెత్తాలని పిలుపునిచ్చారు.
ఈ దాడికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ అత్యంత ప్రాధాన్యంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.