తూప్రాన్ డివిజన్ : మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండలంలోని వడియారం గ్రామ పంచాయితీ శివారులో ఉన్న APL Apollo Tubes కంపెనీలో అన్యాయ బదిలీలు కలకలం రేపుతున్నాయి. గత 14 సంవత్సరాలుగా కంపెనీలో పర్మనెంట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న అనేక మంది కార్మికులను అక్రమంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కార్మికుల వివరాల ప్రకారం, ప్రత్యేకంగా BMS యూనియన్ సభ్యులే లక్ష్యంగా మారినట్లు తెలుస్తోంది. వారిని ఢిల్లీ, రాయపూర్, ముంబై వంటి దూర ప్రాంతాలకు బదిలీ చేస్తూ మేనేజ్మెంట్ ఆదేశాలు జారీచేసిందని కార్మికులు ఆరోపిస్తున్నారు.
ఈ చర్యలను వ్యతిరేకిస్తూ సుమారు 70 మంది కార్మికులు BMS యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెకు దిగారు. కంపెనీ ముందు నిరసన తెలుపుతూ తమ ఉద్యోగ భద్రత కోసం ఉద్యమం చేస్తున్నారు.
“మేము ఇక్కడ 14 ఏళ్లుగా పనిచేస్తున్నాం. మా కుటుంబాలు, జీవితం అంతా ఇక్కడే స్థిరపడిపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా మమ్మల్ని సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం అన్యాయమైంది. ఇది మేం సహించలేం,” అని ఒక కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
BMS యూనియన్ నాయకులు మాట్లాడుతూ, మేనేజ్మెంట్ తక్షణమే బదిలీ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని జిల్లా స్థాయికి, అనంతరం రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లుతామని హెచ్చరించారు.
కార్మికుల డిమాండ్లకు ఇంకా కంపెనీ మేనేజ్మెంట్ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.