హైదరాబాద్ : రైల్వే ప్రయాణాన్ని సామాన్యులకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, టికెట్ల జారీలో పారదర్శకత పెంచేందుకు భారతీయ రైల్వే శాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా తత్కాల్ టికెట్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడంతో పాటు, ఏజెంట్ల ఆధిపత్యానికి చెక్ పెడుతూ పలు కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
ఇకపై తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఆధార్ అథెంటికేషన్, కేవైసీ తప్పనిసరి చేశారు. జులై 1 నుంచి ఈ విధానం అమలులోకి రాగా, జులై 15 నుంచి ఆధార్ ఓటీపీని కూడా ప్రవేశపెట్టారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌లో నిజమైన ప్రయాణికులకు మాత్రమే టికెట్లు దక్కేలా చూడటమే దీని లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ మార్పులో భాగంగా, తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన తొలి అరగంట పాటు అధీకృత ఏజెంట్లు టికెట్లు బుక్ చేయకుండా నిబంధన విధించారు.
60 రోజుల్లోనే అడ్వాన్స్ బుకింగ్..
కేవలం తత్కాల్ మాత్రమే కాకుండా, సాధారణ రిజర్వేషన్ ప్రక్రియలోనూ రైల్వేశాఖ మార్పులు చేసింది. ముందస్తు రిజర్వేషన్ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు (సగానికి) తగ్గించింది. అంతేకాకుండా, అక్టోబర్ 1 నుంచి సాధారణ టికెట్ల బుకింగ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో కేవలం ఆధార్ వెరిఫైడ్ ఖాతాలకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు.
ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు రైల్వే చార్టుల తయారీ సమయాన్ని కూడా మార్చారు. గతంలో రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు చార్ట్ సిద్ధం చేయగా, ఇప్పుడు 8 గంటల ముందే దీనిని పూర్తి చేస్తున్నారు. దీనివల్ల టికెట్ ఖరారు కాని ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి తగినంత సమయం లభిస్తుంది.
ప్రయాణికులకు మరో శుభవార్త అందించేందుకు కూడా రైల్వే బోర్డు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం కన్ఫర్మ్ అయిన టికెట్‌పై ప్రయాణ తేదీని మార్చుకోవాలంటే, టికెట్‌ను రద్దు చేసుకుని కొత్తది బుక్ చేసుకోవాల్సి వస్తోంది. అయితే, వచ్చే జనవరి నాటికి ఆన్లైన్లోనే ఉచితంగా ప్రయాణ తేదీని మార్చుకునే సౌకర్యాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. అయితే ఈ అవకాశం టికెట్ల లభ్యతపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.