పార్వతీపురం – కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మవలస మండలం, అంకవరం గ్రామ పంచాయతీలో శనివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది. తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మరియు కూటమి నుంచి పలువురు ప్రముఖ నాయకులు హాజరై బహిరంగ సభను జ్ఞాపకంగా మలచారు. ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి డోంకాడ రామకృష్ణ, ఒట్టిగెడ్డ ప్రాజెక్టు చైర్మన్ యం. సత్యంనాయుడు, బీజేపురం పీఏసీఎస్ చైర్మన్ సోములు మాస్టారు, కురుపాం నియోజకవర్గ కాపు సంఘం అధ్యక్షులు లంక గోపాలం, మండల ప్రధాన కార్యదర్శి రమా శంకర్, సీనియర్ నాయకులు దాసరి రామారావు, సొంటేన శ్రీరాములు, మురళి తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి టీడీపీ, కూటమి కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డిజిటల్ కార్డులు ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతకు కొత్త దిక్సూచి అవుతాయని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
అంకవరం పంచాయతీ ప్రాంగణం ఈ సందర్భంగా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. తమకు డిజిటల్ రేషన్ కార్డులు అందినందుకు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తహసీల్దార్, స్థానిక అధికారులు, కార్యకర్తల పట్ల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.