నర్సాపూర్ – తూప్రాన్ డివిజన్ : మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న రెండు దొంగతన ఘటనల కేసులో నిందితులను వేగంగా గుర్తించి అరెస్టు చేయడంలో పోలీసులు ప్రతిభను చాటారు. ఈ కేసును ఛేదించిన తూప్రాన్ డివిజన్ పోలీసులు, జిల్లా ఎస్పీ అభినందనలు అందుకున్నారు. కేసులో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందికి రివార్డులు ప్రకటించినట్టు సమాచారం.
కేసు వివరాలు:
Crime No: 324/2025 U/s 309(6) BNS of Narsapur PS, Date: 07.10.2025
నర్సాపూర్ పట్టణంలోని సంగారెడ్డి రోడ్‌లో స్కూటీపై ఒంటరిగా వెళ్తున్న మేకల కొండయ్య అనే వ్యక్తిని ముగ్గురు నిందితులు కారులో వచ్చి ఆపి, చేతులతో కొట్టి బెదిరించి అతని వద్ద ఉన్న ₹350 నగదు, పర్సు, మొబైల్ ఫోన్ లాక్కొన్నారు. అదే రాత్రి, మెదక్ రోడ్ బస్ స్టాప్ వద్ద గొర్రెల కాపరులు అయిన రేణివట్ల నరసింహ మరియు బజారు రామప్ప అనే ఇద్దరిని “లిఫ్ట్ ఇస్తాం” అంటూ కారులో ఎక్కించుకొని, మార్గమధ్యంలో బెదిరించి వారి వద్ద నుండి ₹2500 నగదు, మొబైల్ ఫోన్ లాక్కొన్నారు. పైగా వారి ఫోన్ పే ల ద్వారా ₹5550 రుపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు.
నిందితుల వివరాలు:
A-1: నీలగిరి దశరథ్ (21), పెయింటింగ్ లేబర్, నార్సింగి గ్రామం, మెదక్ జిల్లా
A-2: బుర్నోటి ఆగమయ్య (21), ఎలక్ట్రిషియన్, రేగోడ్ మండలం, మెదక్ జిల్లా (ప్రస్తుతం కూకట్‌పల్లి, హైదరాబాద్)
A-3: దన్నారం కృష్ణ (20), ఇంటర్మీడియట్ విద్యార్థి, కోరంపల్లి గ్రామం, టేక్మల్ మండలం
ఈ నిందితులు ఒక స్విఫ్ట్ కారు (TS 07 HJ 5195) ని స్వయంగా డ్రైవ్ చేసే విధంగా అద్దెకు తీసుకొని, నార్సింగి నుండి హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యంలో నర్సాపూర్ పరిధిలో ఈ నేరాలకు పాల్పడ్డారు.
పోలీసుల దర్యాప్తు మరియు గుర్తింపు:
జగదీర్ గుట్టలోని ఆల్విన్ కాలనీకి చెందిన నిందితులను సాంకేతిక ఆధారాలతో గుర్తించిన నర్సాపూర్ పోలీసులు, సీఐ జాన్ రెడ్డి, ఎస్‌ఐ రంజిత్ కుమార్ నేతృత్వంలో టీం సభ్యులు శ్రీకాంత్, ఉపేందర్, భాగయ్యలు సమర్థవంతంగా విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు. DSP తూప్రాన్ డివిజన్ జె. నరేందర్ గౌడ్ పర్యవేక్షణలో కేసు సవాలుగా మారినప్పటికీ వేగంగా ఛేదించారు.
జిల్లా ఎస్పీ ప్రశంసలు:
ఈ కేసులో పోలీసులు చూపిన చాకచక్యాన్ని మెదక్ జిల్లా ఎస్పీ హర్షంగా అభినందించారు. నేరస్తుల అరెస్ట్, దొంగ సొత్తుల స్వాధీనం విషయంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా ప్రోత్సహించారని సమాచారం. నేరాల దర్యాప్తు, ప్రజల భద్రత కోసం పోలీసులు అంకితభావంతో పని చేస్తుండటంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.