ఆంధ్రప్రదేశ్ : ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుంచి రానున్న రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
నైరుతి బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా, ఉత్తర తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఉండగా, అది నైరుతి బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉన్న మరో ఆవర్తనంతో కలిసిపోయిందని తెలిపింది.
దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ ప్రాంతాలు, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
సోమవారం (13వ తేదీ) అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదివారం విజయనగరం జిల్లా గొల్లపాడులో 35.2 మి.మీ, కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో 32.5 మి.మీ, విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలసలో 32.2 మి.మీ, అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేటలో 28 మి.మీ వర్షపాతం నమోదైందని వెల్లడించింది.