ఎన్ని ప్రభుత్వాలు మారినా పార్వతీపురం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు తిప్పలు తప్పడం లేదు. కురుపాం మండలం, తిత్తిరి పంచాయతీ, గిరిశిఖర గ్రామం, పులుపుట్టి కి సరైన రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, రోడ్డు లేకపోవడంతో డోలీపై గర్భిణిని తీసుకొచ్చి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తారలించాల్సి వస్తుంది. పులుపుట్టి గ్రామాన్ని ఆనుకుని మర్రిమాను గూడ, చింతమాను గూడా, జమ్మూ నాయుడు గూడా, పొలం గూడా వంటి మరో ఐదు గిరిశిఖర గ్రామాలు ఉన్నాయని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా రహదారి సదుపాయం లేక అత్యవసర పరిస్థితిల్లో అవస్థలు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేసారు.
ఎన్నికల్లో రోడ్లు వేస్తామని ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినా గెలిచిన తరువాత పట్టించుకోవడం లేదని గిరిజనులు పేర్కొన్నారు. గత ప్రభుత్వం కూడా గిరిజన ప్రాంతాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇకనైనా ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారి సౌకర్యం కల్పించి డోలీ మోతలు తప్పించాలని గిరిజనులు కోరుతున్నారు.