పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మ వలస మండలం, తోటపల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులైన బాసంగి గ్రామంలో స్థానికులు, విద్యార్థులు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నివసిస్తున్నారు. మంగళవారం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పాము హల్‌చల్ సృష్టించింది. ఉదయం పాఠశాల తలుపులు తెరవగానే పాము హఠాత్తుగా ప్రత్యక్షం కావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర భయాందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు స్థానికులను పిలిపించి పామును తరిమే ప్రయత్నం చేశారు. స్థానికులు దానిని ఉడత నాగు (Rat Snake) పాముగా గుర్తించారు. ఇది చాలా ప్రమాదకరమైనదని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, స్థానికులు మాట్లాడుతూ… పాఠశాలకు దగ్గరగా నీరు నిలిచి ఉండటం వలన ఇది విషసర్పాలకు (పాములకు) నిలయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి సంఘటనలు పాఠశాలలో చాలాసార్లు జరిగాయని తెలిపారు. ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు పాఠశాల ముంపునకు గురై అనేక ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు. పాఠశాలను ఇప్పటికైనా సురక్షితమైన ప్రదేశానికి మార్చాలని అధికారులను కోరుతున్నామని వారు విజ్ఞప్తి చేశారు.
