మెదక్ : నిన్న రిపోర్టర్ టీవీ ప్రచురించిన కథనానికి స్పందనగా, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈరోజు అత్యవసరంగా జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాను డ్రగ్స్, గంజాయి రహితంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా ఆయన ఈ సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు, అదనపు కలెక్టర్ నాగేశ్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ .. గ్రామాల్లో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేయాలని, గంజాయి సాగు చేస్తే రైతు బంధు, ఇతర ప్రభుత్వ పథకాలు నిలిపివేయాలని, గంజాయి సాగు వల్ల వచ్చే దుష్పరిణామాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ వలన కలిగే ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మెడికల్ షాప్‌లు, పరిశ్రమలు, పట్టణాల్లో కూడళ్ల వద్ద క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని సూచించారు. గ్రామాల్లోకి వచ్చే అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని చెప్పారు.
జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చే వారిని శ్రద్ధగా పరిశీలించాలన్నారు. ముఖ్యంగా డాబాల వద్ద శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో డ్రగ్స్ నియంత్రణ కోసం పరిపూర్ణ చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ సమావేశం జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ నియంత్రణకు ఒక మైలురాయిగా నిలవనుంది.