పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘మెగా డీఎస్సీ’ ద్వారా కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులతో ‘థాంక్యూ సీఎం సార్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మండల విద్యాశాఖ అధికారులు, నూతన ఉపాధ్యాయులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ఆవరణలోని చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ… ఉపాధ్యాయ వృత్తి దేవుడు ఇచ్చిన గొప్ప వరమని, ఎవరైనా ఉన్నత స్థాయికి వెళ్లాలంటే ఉపాధ్యాయుడే కారణమని అన్నారు. మెగా డీఎస్సీ ద్వారా కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులుగా భావించి విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను బోధించాలని కోరారు.
విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని, రాష్ట్రంలో 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ నిర్వహించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేయాలని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎన్ని ఆటంకాలు వచ్చినా సమర్థవంతంగా నిలబడి మెగా డీఎస్సీని పూర్తి చేశారని కొనియాడారు. డీఎస్సీ అంటే సీబీఎన్, సీబీఎన్ అంటే డీఎస్సీ అని అన్నారు. విద్యార్థుల భావితరాల భవిష్యత్తు కోసం మెరుగైన విద్యను అందించాలని నూతన ఉపాధ్యాయులను ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి బి. రాజ్ కుమార్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు కడ్రక మల్లేశ్వరరావు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ కడ్రక కళావతి, మండల విద్యాశాఖ అధికారులు చంద్రశేఖర్, భీముడు, హరి మాస్టర్, శంకర్రావు, ఎస్ఎంసీ చైర్మన్ సొంటేనా రాజేష్, కూటమి నాయకులు క్రాంతి కుమార్, దొరబాబు, మన్మధ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
