కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా / కాగజ్ నగర్ : జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు కాగజ్ నగర్ జెడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ ప్రాంగణంలో జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాబృంద సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, బాల్యవివాహాల ముప్పులు, రోడ్డు ప్రమాదాల నివారణ, చట్టం-శాంతి భద్రత, మహిళల భద్రత, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, హెల్ప్‌లైన్ నంబర్లు (100, 1098, 1930) వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ ప్రశ్నలను స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్ ని అడిగి, సమగ్రమైన సమాధానాలు పొందారు. యువతలో క్రమశిక్షణ, నైతిక విలువలు, సమాజ సేవా భావన పెంపొందించుకోవాలని సూచనలిచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహా పంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కళాబృంద సభ్యులు రోహిత్, రాంచందర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, రజిత, సంఘవి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
