అనంతపురం జిల్లా గుత్తి మండలం లచ్చానుపల్లి గ్రామానికి చెందిన యువ రైతు నాగార్జున ఇంట ఆనందం నెలకొంది. తన వద్ద సుమారు 100 గొర్రెలు, మేకలు ఉన్నాయి. సాధారణంగా ఒక మేక ఒక్కసారిగా ఒకటి లేదా రెండు పిల్లలకు మాత్రమే జన్మనిస్తుంది. అయితే నాగార్జునకు చెందిన ఒక మేక విశేషంగా ఒకే కాన్పులో నలుగురు మేక పిల్లలకు జన్మనిచ్చి ఆశ్చర్యపరిచింది.
మూడు రోజుల క్రితం ఈ సంఘటన చోటుచేసుకోగా, ప్రస్తుతం ఆ నాలుగు పిల్లలు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని నాగార్జున తెలిపారు. అరుదైన ఈ సంఘటనతో గ్రామస్తులు కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. మేకపాల ఉత్పత్తి, పెంపకం రంగంలో ఇది శుభసూచకంగా భావిస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు.
ఈ అరుదైన ఘటన విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా, ఇప్పుడు అది ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.










