contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Supreme Court: తప్పుడు కేసుల్లో శిక్ష అనుభవించిన నిర్దోషులకు నష్టపరిహారం

ఢిల్లీ : తప్పుడు అభియోగాలతో అన్యాయంగా జైలు శిక్ష అనుభవించిన నిర్దోషులకు నష్టపరిహారం చెల్లించే అంశంపై సుప్రీంకోర్టు తీవ్రంగా దృష్టి సారించింది. వ్యవస్థ తప్పిదాల వల్ల బలిపశువుగా మారిన వ్యక్తి, విలువైన జీవితాన్ని కోల్పోయినప్పుడు పరిహారం అందించేందుకు ఒక పటిష్ఠమైన విధానాన్ని రూపొందించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియలో ఉన్న చట్టపరమైన సంక్లిష్టతలను అధిగమించేందుకు తమకు సహాయం చేయాల్సిందిగా అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్‌లను కోరింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో తప్పుడు ఆరోపణలతో 12 ఏళ్లు జైలు జీవితం గడిపిన ఓ నిరుపేద వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ కేసులో థానే కోర్టు అతనికి 2019లో మరణశిక్ష విధించింది. అయితే, సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు అతన్ని నిర్దోషిగా తేల్చి ఇటీవల విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తాను కోల్పోయిన 12 ఏళ్ల జీవితానికి పరిహారం ఇప్పించాలని కోరుతూ బాధితుడు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

బాధితుడి తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. “ఇలాంటి కేసుల్లో బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. జైలు జీవితం వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమే. దీనిపై కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి” అని ఆయన కోరారు. ఈ అంశంపై ఒక స్థిరమైన ఏర్పాటు అవసరమని గతంలో లా కమిషన్ కూడా సిఫార్సు చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ధర్మాసనం దేశంలో శిక్షలు పడుతున్న కేసుల శాతం కేవలం 54గా ఉండటాన్ని గుర్తుచేసింది. తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం లేదా వ్యవస్థ బాధితుడిని బలిపశువును చేయడం వంటి సందర్భాల్లో పరిహారం అంశాన్ని పరిగణించాలని భావిస్తున్నట్లు ధర్మాసనం సూచనప్రాయంగా తెలిపింది.

ఇదే ధర్మాసనం, మానసిక వైద్య చట్టం-2017 అమలుపై దాఖలైన మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి బదిలీ చేసింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :