కరీబియన్ దీవులను ‘మెలిసా’ హరికేన్ కుదిపేస్తోంది చేస్తోంది. కేటగిరీ 5 హరికేన్ గా మారిన మెలిసా పలు దేశాలపై పెను విధ్వంసం సృష్టిస్తోంది. గంటకు 295 కిలోమీటర్ల భయానక వేగంతో వీస్తున్న ప్రచండ గాలులకు కరీబియన్ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే జమైకాను దాటిన ఈ హరికేన్, క్యూబాలోని రెండో అతిపెద్ద నగరమైన శాంటియాగో డి క్యూబా వైపు దూసుకెళుతోంది.
హరికేన్ తీవ్రతకు అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. వేలాది ఇళ్ల పైకప్పులు గాలిలో ఎగిరిపోయాయి. ఈ విలయానికి ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో జమైకా, హైతీ దేశాలకు చెందిన వారు చెరో ముగ్గురు ఉండగా, డొమినికన్ రిపబ్లిక్లో ఒకరు మరణించారు.
జమైకాలోని బ్లాక్ నది పరివాహక ప్రాంతంలో మూడు కుటుంబాలు తమ ఇళ్లలోనే చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. వరద ప్రవాహం కారణంగా సహాయక సిబ్బంది వారిని చేరుకోలేకపోతున్నారని తెలిపాయి.
ప్రమాద తీవ్రతను గుర్తించిన అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. హరికేన్ ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 15 వేల మందిని ఖాళీ చేయించి తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు. మెలిసా హరికేన్‌ను అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ 5గా ప్రకటించడంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.









