వరంగల్ : చారిత్రక నగరం వరంగల్‌ను మొంథా తుపాను అతలాకుతలం చేసింది. బుధవారం రోజంతా ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి నగరం నీట మునిగింది. ప్రధాన రహదారులతో పాటు అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షం తగ్గుముఖం పట్టినా వరద ఉద్ధృతి తగ్గకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వరద నీటిలో 45 కాలనీలు
నగరంలోని 45 కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా సాయిగణేశ్ కాలనీ, సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్‌ఎన్ నగర్, మైసయ్యనగర్ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సుమారు 30 కాలనీలు పూర్తిగా బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. పడవల సాయంతో లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరంగల్ తూర్పులో ఆరు సహా నగరవ్యాప్తంగా మొత్తం 12 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 1200 మంది బాధితులను ఈ శిబిరాలకు తరలించారు.
భారీ వర్షాల కారణంగా హంటర్‌రోడ్డులోని బొందివాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరంగల్, హనుమకొండ మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ములుగు వెళ్లే రహదారిపై కూడా నాలాలు పొంగిపొర్లుతున్నాయి. అత్యవసర సహాయం కోసం వరంగల్ బల్దియా కార్యాలయంలో 1800 425 1980 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. డీఆర్‌ఎఫ్, ఇంజినీరింగ్, శానిటరీ సిబ్బందితో కూడిన ఏడు ప్రత్యేక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
వరదల తీవ్రత దృష్ట్యా, ముందుజాగ్రత్త చర్యగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పాఠశాలల్లో జరగాల్సిన ఎస్‌ఏ-1 పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) వెల్లడించారు.









