కరీంనగర్ జిల్లా : గన్నేరువరం మండల కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద గురువారం వర్షం కారణంగా నీటి ప్రవాహం పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో చెరువు వద్ద చేపల కాపలా కోసం ఉన్న బీహార్ రాష్ట్రానికి చెందిన రాజీప్, లాల్ కు బచ్చన్ అనే వ్యక్తులు స్వంత పనుల కోసం గుండ్లపల్లి నుంచి కరీంనగర్ వైపు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.
వీరు వెంకటరావుపల్లి మీదుగా ప్రయాణిస్తుండగా, చొక్కారవుపల్లి–గన్నేరువరం పెద్ద చెరువు వద్ద రహదారిపై వరద నీరు ఎక్కువగా ఉండటంతో వాహనం అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయింది.
వెంటనే సమాచారం అందుకున్న గన్నేరువరం పోలీసులు చెరువు వద్దకు చేరుకుని, తాళ్ల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టారు. సమయస్ఫూర్తితో స్పందించిన పోలీసులు నీటిలో కొట్టుకుపోయిన ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే ద్విచక్ర వాహనం మాత్రం నీటిలో మునిగిపోయింది.
ఈ సంఘటనలో గన్నేరువరం పోలీసుల చొరవకు స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పోలీసుల సమయోచిత చర్యల వలన ఒక పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు అభినందనలు తెలిపారు.









