నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌కు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ నెల 13 వరకు ఆయనకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు కూడా రిమాండ్ విధించడంతో సోదరులిద్దరినీ పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు.
అంతకుముందు ఎన్‌టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆదివారం ఉదయం జోగి రమేశ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తూర్పు ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో ఆయనను సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దనరావుతో ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీశారు. రమేశ్‌ను, ఆయన సోదరుడు రామును వేర్వేరుగా, ఆపై కలిపి ప్రశ్నించారు.
విచారణ అనంతరం వైద్య పరీక్షలు పూర్తి చేసి, సోదరులిద్దరినీ అర్ధరాత్రి దాటిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. రాత్రిపూట వాదనలు కొనసాగి, తెల్లవారుజామున 5 గంటల సమయంలో న్యాయమూర్తి రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. దీంతో పోలీసులు వారిని విజయవాడ జైలుకు తరలించారు.










