కేరళ రాష్ట్రం : కేవలం 10 ఎంఎల్ మద్యం కలిగి ఉన్నందుకు 32 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసిన కేరళ పోలీసుల తీరుపై మంజేరి జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఇది జరిగింది అల్లా టప్పా దేశంలో (బనానా రిపబ్లిక్) కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో” అంటూ న్యాయస్థానం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పోలీసుల అధికార దుర్వినియోగానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడానికి ఈ ఘటన ఒక నిదర్శనమని అభిప్రాయపడింది.
వివరాల్లోకి వెళితే, తిరూర్ సమీపంలోని పైన్‌కన్నూర్‌కు చెందిన ధనేష్‌ను అక్టోబర్ 25న వలంచెరి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 10 మిల్లీలీటర్ల మద్యం ఉన్న ఒక చిన్న సీసాను కనుగొన్న పోలీసులు, కేరళ అబ్కారీ చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించగా, దాదాపు వారం రోజుల పాటు జైల్లో ఉన్న తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు.
ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి పోలీసుల చర్యను తీవ్రంగా తప్పుపట్టారు. అరెస్ట్ లేదా రిమాండ్ అవసరం లేని చిన్న నేరానికి ఒక వ్యక్తిని వారం రోజులు జైల్లో నిర్బంధించడం దారుణమని అన్నారు. ఇంత చిన్న పరిమాణంలో మద్యం కలిగి ఉన్నందుకు ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకోవడంలో హేతుబద్ధత ఏముందని ప్రశ్నించారు. ఇలాంటి ఏకపక్ష చర్యల వల్ల చట్ట అమలు సంస్థలపై ప్రజలకు నమ్మకం పోతుందని, న్యాయ సూత్రాలు బలహీనపడతాయని హెచ్చరించారు.
ఈ ఘటనపై న్యాయ నిపుణులు, హక్కుల కార్యకర్తలు కూడా స్పందించారు. కేరళలో అబ్కారీ చట్టాల అమలులో పోలీసుల అతి జోక్యానికి ఇది ఒక ఉదాహరణ అని వారు పేర్కొన్నారు. చిన్న చిన్న ఉల్లంఘనల విషయంలో విచక్షణతో వ్యవహరించేందుకు అబ్కారీ చట్టం వీలు కల్పిస్తుందని, కానీ పోలీసులు దానిని విస్మరిస్తున్నారని తెలిపారు. కోర్టు వ్యాఖ్యలతో అబ్కారీ చట్టం కింద అరెస్టులకు సంబంధించిన పోలీసు నిబంధనలను పునఃసమీక్షించాలన్న చర్చ మళ్లీ మొదలైంది.
కాగా, కేరళలో చట్టప్రకారం అధీకృత దుకాణంలో కొనుగోలు చేసిన 3 లీటర్ల వరకు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌ను (IMFL) ఎలాంటి పర్మిట్ లేకుండా కలిగి ఉండవచ్చు. అంతకు మించి మద్యం కలిగి ఉంటేనే అది చట్టరీత్యా నేరం. ఈ నేపథ్యంలో కేవలం 10 ml మద్యం కోసం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపడం వివాదాస్పదంగా మారింది.










