అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో సిక్కు మత స్థాపకుడు గురు నానక్ దేవ్ జీ 556వ జయంతిని పెన్షనర్స్ అసోసియేట్ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురు నానక్ చిత్రపటానికి కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు, అసోసియేట్ అధ్యక్షురాలు స్వర్ణాంబ పూలమాల వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ గురు నానక్ జయంతి అనేది సిక్కు మతంలోని మొదటి గురువు గురు నానక్ పుట్టిన రోజు సందర్భంగా జరుపుకునే మహోత్సవమని పేర్కొన్నారు. ఈ పండుగను గురు నానక్ ప్రకాశ్ ఉత్సవ్ లేదా గురు నానక్ దేవ్ జీ గుర్‌పురబ్ డే అని కూడా పిలుస్తారని తెలిపారు.
సిక్కు మతంలోని పది మంది గురువుల వార్షికోత్సవాలలో గురు నానక్ జయంతి అత్యంత ప్రాముఖ్యత కలిగినదని వక్తలు పేర్కొన్నారు. సిక్కు మత స్థాపకుడైన గురు నానక్ దేవ్ 1469 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి నాడు జన్మించారని, ప్రతి సంవత్సరం ఇదే రోజున ప్రపంచవ్యాప్తంగా భక్తులు ప్రార్థనలతో, సేవా కార్యక్రమాలతో ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారని తెలిపారు.
ఈ వేడుకలో వైస్ ప్రెసిడెంట్ షైక్షా వళి, నారాయణరెడ్డి, గోవిందప్ప, నారాయణ శెట్టి, లక్ష్మీ నారాయణరెడ్డి, శామ్యూల్, మద్ది లేటి, హస్సన్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాల్గొన్నవారు గురు నానక్ బోధించిన సత్యం, సమానత్వం, సేవా భావం వంటి విలువలను సమాజంలో విస్తరించాలన్న సంకల్పాన్ని వ్యక్తం చేశారు.










