ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోలార్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేస్తున్న గ్రామాలు బేతపల్లి ధర్మాపురం బాచుపల్లి కరిడికొండ ఊటకల్లు గ్రామాలలో పర్యటన చేసి రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రధానంగా రైతులు కొంతమంది తెలియకుండానే సోలార్ ప్రాజెక్టుకు ఇచ్చేశామని అందువల్ల మేము పూర్తిగా నష్టపోతున్నామని ఇప్పుడు మాకు అర్థమవుతుందన్నారు. అయితే ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు కొంతమందిని బలవంతంగా భూములు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు తెలిపారు. సోలార్ యజమానులు కూడా ముందుగా భూమి చుట్టుప్రక్కల కొనుగోలు చేసి మధ్యలో ఉన్న రైతులను బెదిరించి బలవంతంగా భూసేకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిజంగా రైతులు ఇష్టపడి ఇచ్చినట్లయితే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేయాలన్నారు అదేవిధంగా భూములు మీద ఆధారపడిన వ్యవసాయ కార్మికులకు, చేతివృత్తిదారులకు 19 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు 5 వేల రూపాయలు చొప్పున, లేదా సంవత్సరానికి ఒక మొత్తంగా 60వేల రూపాయలు నష్ట పరిహారం చెల్లించి వలసలు నివారించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2013 భూ సేకరణ చట్టం పైన జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసిల్దార్ భూసేకరణ జరుగుతున్న గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. లేని పక్షంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సూరి, ఉపాధ్యక్షులు రాధాకృష్ణ, సహాయ కార్యదర్శి భాస్కర్, సిఐటియు మండల కార్యదర్శి నిర్మల, రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నాగప్ప, నాగ లింగయ్య, గుత్తి మండల అధ్యక్షులు చందు, వన్నూరమ్మ, రామేశ్వరి, సుజాత తదితరులు పాల్గొన్నారు.










