కరీంనగర్ జిల్లా : గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బోయిని మల్లేశం (వయసు 45) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. మల్లేశం వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే వ్యవసాయానికి తీసుకున్న అప్పులు, పంటలు విఫలమవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం.
ఈ నెల 5వ తేదీ బుధవారం తన వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని తక్షణమే అంబులెన్స్‌లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతున్న మల్లేశం సోమవారం రాత్రి 12 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లేశం మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భార్య సరవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని ఎస్ఐ నరేందర్ రెడ్డి తెలిపారు.
మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో కుమార్తె మృతి చెందగా, ఇప్పుడు భర్త మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
మల్లేశం కుటుంబానికి ప్రభుత్వం నుండి తగిన ఆర్థిక సహాయం అందించాలని, రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ముదిరాజ్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.










