అనంతపురం జిల్లా : అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గుత్తి తహసిల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. పట్టణ కార్యదర్శి రాజు యాదవ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా నుండి గాంధీ చౌక్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా తహసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో గుత్తి పట్టణం మార్మోగిపోయింది.
పార్టీ నాయకులు మాట్లాడుతూ, గత తొమ్మిది నెలలుగా పేదలు ఇంటి స్థలాల కోసం మున్సిపాలిటీ కమిషనర్‌కి దరఖాస్తులు సమర్పించినప్పటికీ ఇంకా స్పందన లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు వెయ్యిమందికి పైగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసినప్పటికీ, ఇప్పటికీ ఇళ్ల పట్టాల జారీ జరగలేదని తెలిపారు.
మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లి సమీపంలోని సర్వే నంబర్ 122/C లో ఉన్న 35 ఎకరాల భూమిని ఇళ్ల లేని పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 20 రోజుల వ్యవధిలో ఆ భూమిని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు పంపిణీ చేస్తామని తహసిల్దార్ పుణ్యవతికి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జి. రామదాసు, సిపిఐ నాయకులు రమేష్, మండల సహాయ కార్యదర్శి నరసింహయ్య, వెంకటరాముడు, పట్టణ సహాయ కార్యదర్శి నజీర్, మహమ్మదా, ఆటో వర్కర్స్ నాయకులు ఆర్.బి. రామంజి, రజాక్, సురేష్, మహమ్మద్, శివ, సీనియర్ నాయకులు డానియల్, రామకృష్ణ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
నాయకులు ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ — “పేదల ఇళ్ల కల నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో సిపిఐ పార్టీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుంది” అని హెచ్చరించారు.










