మాసాయిపేట, తూప్రాన్ డివిజన్ : తెలంగాణ రాష్ట్ర కవి, ఉద్యమకారుడు, సాహితీవేత్త అందెశ్రీ ఆకస్మిక మరణం రాష్ట్రానికి తీరని లోటు అని పలువురు సంఘాల నాయకులు పేర్కొన్నారు.
అంబేద్కర్ సంఘం అధ్యక్షులు చిన్నరాం లక్ష్మణ్ మాట్లాడుతూ — “అందెశ్రీ గారు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రసాదించిన మహనీయుడు. ఆయన రచనలు, ఆలోచనలు, కవిత్వం తెలంగాణ ఆత్మను ప్రతిబింబించాయి. ఆయన మరణం తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాలకు పెద్ద నష్టం” అని అన్నారు.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు యాదగిరి మాదిగ మాట్లాడుతూ — “ఆయన ఆకస్మిక మరణవార్త మనందరినీ తీవ్రంగా కలచివేసింది. ‘జయ జయహే తెలంగాణ’ గీతం ద్వారా తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆ గీతం తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన చారిత్రాత్మక కృతి” అని పేర్కొన్నారు.
“రాష్ట్ర అవతరణలో అందెశ్రీ గారి పాత్ర మరువలేనిది. ఆయన సాహిత్యం తెలంగాణ ప్రజాసంస్కృతికి ప్రాణం పోసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము,” అని యాదగిరి మాదిగ తెలిపారు.
ఇక రజక సంఘం నాయకుడు గుల్లపల్లి బాబు, అంజనీపుత్ర యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ తదితరులు అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
నాయకులు మాట్లాడుతూ — “తెలంగాణ గౌరవం, ఆత్మగౌరవం కోసం తన కలం ద్వారా పోరాడిన అందెశ్రీ మనందరికీ స్ఫూర్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి” అని అన్నారు.










