పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను సర్వోన్నత న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది.
ఈరోజు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఇరుపక్షాల వాదనలను విన్నది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాల తర్వాత జరుపుతామని స్పష్టం చేసింది. కాగా, నేటి విచారణలో తమకు కచ్చితంగా బెయిల్ లభిస్తుందని ఆశించిన పిన్నెల్లి సోదరులకు ఈ పరిణామం నిరాశ కలిగించింది.
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మే 25న పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో పోలీసులు మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చారు. జవిశెట్టి శ్రీను (A1), తోట వెంకట్రావు (A2), తోట గురవయ్య (A3), నాగరాజు (A4), తోట వెంకటేశ్వర్లు (A5)లతో పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని (A6), పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని (A7) పేర్కొన్నారు. అందరిపైనా ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.










