అనంతపురం : గుత్తి పట్టణ పరిధిలోని నెమతాబాద్ హౌసింగ్ లేఔట్లో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 3 లక్షల ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి సామూహిక గృహప్రవేశాలు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్ తదితరులు పాల్గొని లబ్ధిదారులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఇళ్లను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఇంటి తాళంచెవిలను అందజేసి, ఇళ్ల ముందు మొక్కలు నాటారు.
సమావేశంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పాలనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల గృహప్రవేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. “నిరుపేద కుటుంబాల కల నేడు నెరవేరింది. మధ్యలో ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించాం,” అని అన్నారు. మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి ₹7,500 కోట్లు ఖర్చు చేశామని, గుంతకల్లు నియోజకవర్గంలో 1,300 ఇళ్లు నిర్మించడానికి ₹4.34 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మూడు, పట్టణాల్లో రెండు సెంట్ల భూమిని ఇల్లు కట్టుకునేలా ఇస్తామని చెప్పారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ తల్లికివందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్లు వంటి పథకాలు అమలు చేస్తున్నామని, తాగునీటి సౌకర్యం కోసం పైపులైన్ వేస్తామని వెల్లడించారు.
ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, జిల్లాకు 71,508 ఇళ్లు మంజూరయ్యగా, గత ఐదేళ్లలో 37,994 మాత్రమే నిర్మించారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 వేల ఇళ్లు పూర్తి చేశామని చెప్పారు. మార్చిలోపు మిగిలిన ఇళ్లు పూర్తి చేసుకునేలా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. “మా ప్రభుత్వం పేదల పక్షపాతి. ఉచిత బస్సు, 3 గ్యాస్ సిలిండర్లు, తల్లికివందనం, ఉపాధ్యాయ నియామకాలు వంటి హామీలను నెరవేర్చుతున్నాం,” అన్నారు. కాలనీలో రోడ్లు వేసేందుకు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ₹10 లక్షలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. గుత్తి కోట అభివృద్ధి, పట్టణానికి పెన్నా నది నుంచి నీటి సరఫరా వంటి అంశాలపై దృష్టి సారిస్తామని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఒకటిన్నర సంవత్సరంలో 3 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, అనంతపురం జిల్లాలో 9,954 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసినట్టు తెలిపారు. రాబోయే 3–4 నెలల్లో మిగిలిన ఇళ్లు పూర్తిచేసుకోవాలని సూచించారు. “2026 మార్చిలోపు అన్ని ఇళ్లు పూర్తి చేయాలి. తర్వాత కొత్త హౌసింగ్ పథకం – పిఎంఏవై 2.0 అమలులోకి వస్తుంది,” అని తెలిపారు. అర్హత ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే కొత్త పథకంలో ఇళ్లు మంజూరు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.
రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్ మాట్లాడుతూ, “పేదలకు పండుగ వాతావరణంలో ఇళ్లు అందించడం సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పబలం ఫలితం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 90 శాతం పైగా అమలు చేసింది,” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో గుంతకల్ ఆర్డీఓ ఏబీవీఎస్బీ శ్రీనివాస్, మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కలచెరువు ప్రతాప్, డాక్టర్ హిమబిందు, హౌసింగ్ పీడీ శైలజ, డిఎల్డిఓ విజయలక్ష్మి, తహసీల్దార్ పుణ్యవతి, హౌసింగ్ డిఈ షాషావలి, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, ఏఈ సూర్యనారాయణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









