కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని పారువెల్ల గ్రామంలో కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం హైదరాబాద్ నుండి వచ్చిన ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రైతు క్షేత్ర పాఠశాలలో భాగంగా రైతులకు సమగ్ర సస్య రక్షణ కిట్లు (ఐపిఎం) అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకటరెడ్డి పర్యవేక్షణలో గత కొన్ని వారాల నుండి క్షేత్రస్థాయిలో ప్రత్తి పంట వేసినప్పటి నుండి పంట చేతికి వచ్చే వరకు పాటించవలసిన అన్ని సస్య రక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. సీఐపిఎంసి ఇన్చార్జి సునీత, సస్య రక్షణ అధికారి మాట్లాడుతూ పురుగు మందులు వాడేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తల గురించి, ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవి ఉపయోగం గురించి వివరించి, సమగ్ర సస్య రక్షణ పై చాలా విషయాలు చెప్పారు. వెంకట రెడ్డి, సస్య రక్షణ అధికారి రైతులకు రెక్కల పురుగు పై నిఘా పెట్టటానికి లింగాకర్షక బుట్టలు వాడాలని చెప్పి ఐపిఎం కిట్ ఉపయోగాలు చూపించారు.హోన్నప్ప గౌడ, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మాట్లాడుతూ ఎన్ పిఎస్ఎస్ మొబైల్ యాప్ ఉపయోగాల గురించి చెప్పి, దానిని వాడాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి మాట్లాడుతూ రైతులు ఈ ఐపిఎం కిట్ లను పొలానికి వెళ్ళే సమయంలో కచ్చితంగా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అనూషరెడ్డి, గ్రామ పెద్దలు మరియు గ్రామ రైతు సోదరులు పాల్గొన్నారు. రైతులు అందరూ ఈ పొలంబడి కార్యక్రమాన్ని అభినందించారు.










