విశాఖపట్నం : నగరంలో భారీ ఎత్తున అక్రమ గోమాంసం నిల్వలు బయటపడిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ దందా వెనుక ఉన్న ముఠాల మూలాలను తక్షణమే వెలికితీయాలని విశాఖ పోలీసులను ఆయన ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఘటన వెలుగులోకి రాగానే ఆయన నేరుగా విశాఖ పోలీస్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డీఆర్ఐ అధికారులు మిత్రా కోల్డ్ స్టోరేజీలో జరిపిన దాడుల్లో 1.89 లక్షల కిలోల గోమాంసాన్ని స్వాధీనం చేసుకుని, కేసును పోలీసులకు అప్పగించినట్లు కమిషనర్ పవన్ కల్యాణ్‌కు వివరించారు. కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ఈ మాంసాన్ని ఎక్కడి నుంచి సేకరించారు, ఎక్కడికి తరలించాలని చూశారు, అనుమతుల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని కమిషనర్ పేర్కొన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
అక్రమ గోవధ, గోమాంసం విక్రయాలు, ఎగుమతులను ఏ రూపంలోనూ సహించేది లేదని పవన్ తేల్చిచెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం గోవధ నిషేధంపై ఎంత పటిష్టంగా పనిచేస్తుందో ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. గతంలో తన దృష్టికి రాగానే పిఠాపురంలోని జంతు వధశాలను మూసివేయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.










