సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది భారత యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగి వారంతా సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరణించిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందినవారే ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
వివరాల్లోకి వెళితే, పవిత్ర మక్కా యాత్రను ముగించుకుని యాత్రికులు బస్సులో మదీనా నగరానికి బయలుదేరారు. ఈ క్రమంలో వారి బస్సును ఎదురుగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద తీవ్రతకు బస్సులో ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. ఈ దుర్ఘటనలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు సహా మొత్తం 42 మంది అక్కడికక్కడే మరణించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
ప్రమాద విషయం తెలియగానే సౌదీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషాద ఘటనతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









