- రెండు కేసుల్లో నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు
- నకిలీ పత్రాలతో భూ కబ్జా యత్నం, చీటింగ్ కేసుల్లో ప్రమేయం
- వివరాలు వెల్లడించిన కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. నిరంజన్ రెడ్డి
కరీంనగర్ జిల్లా: పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉంటూ, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న రౌడీ షీటర్ ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
వివరాలు ఇలా ఉన్నాయి
నిందితుడు తిరుపతి నితిన్ వర్ధన్ (తండ్రి: విష్ణువర్ధన్) కరీంనగర్ వాసి. ఇతనిపై గతంలో కరీంనగర్ వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. నిందితుడి నేర చరిత్ర దృష్ట్యా ఇతనిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయబడింది.
◆ తాజా కేసులు:
2024 సంవత్సరంలో నిందితుడిపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి.
భూ కబ్జా మరియు బెదిరింపులు: తీగులగుట్టపల్లి లోని కార్తికేయ నగర్ లో ఫిర్యాదుదారుడైన పంబాల శ్రీనివాస్ కు చెందిన భూమిని కబ్జా చేయడానికి నిందితుడు ప్రయత్నించాడు. తప్పుడు ‘లీగల్ హెయిర్ సర్టిఫికెట్’ సృష్టించి, భూమిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో లేదా డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో యజమానిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటనపై నిందితుడితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. మోసం (Cheating): మరో ఘటనలో, భూమి రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మబలికి ఒక వ్యక్తి వద్ద డబ్బులు తీసుకొని, రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేసినట్లుగా కూడా ఇతనిపై కేసు నమోదైంది.
ఈ రెండు కేసుల్లో పోలీసులకు దొరకకుండా నిందితుడు వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటూ తిరుగుతున్నాడు. కరీంనగర్ రూరల్ పోలీసులు పక్కా సమాచారంతో, ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడు నితిన్ వర్ధన్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితుడిని ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరిగింది.









