contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి చేస్తాం : మంత్రి అచ్చెన్నాయుడు

పార్వతీపురం మన్యం : పార్వతీపురం మన్యం వ్యవసాయాధారిత జిల్లా అని, ఇక్కడ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా సమీక్షా సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పండిన వరి పంటలో చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులు ఖాతాల్లో నగదు జమ చేసిందుకు 48 గంటలు సమయం నిర్ణయించినప్పటికీ, శాఖాధికారుల చొరవతో కేవలం ఎనిమిది గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతున్న సంగతిని మంత్రి గుర్తుచేస్తారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ధాన్యం రంగుమారిన, చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు అధికారులకు జారీచేసామని అన్నారు. మొంథా తుఫాను, అంతకుముందు వచ్చిన తుఫానుల వలన నష్టపోయిన రైతుల వివరాలు సేకరించామని, వ్యవసాయ, ఉద్యానవన పంటలతో పాటు పశు నష్టాన్ని గుర్తించి వారికి ఇన్ ఫుట్ సబ్సిడి కింద నష్టపరిహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో పత్తి దిగుబడి అధికంగా ఉందని, ఇప్పటికే భామిని, సాలూరు ప్రాంతాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, కొమరాడలో కూడా పత్తి కొనుగోలు కేంద్రం కావాలని రైతులు కోరుతున్నారని, దానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాదిలో కురిసిన వర్షాలతో పత్తి తడిసి రంగు మారిందని, ప్రభుత్వ నిబంధనలను సడలించి ఆ పత్తిని కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వ కాటన్ సంస్థతో మాట్లాడి పత్తి రైతులకు న్యాయం చేయాలని చూస్తున్నట్లు మంత్రి వివరించారు. అన్నదాత సుఖీభవ కింద రూ.7వేలు రెండో విడత విధులు విడుదల చేసామని అన్నారు. ఇనాం భూములున్న రైతులకు జిల్లాలో దాదాపు రూ.8కోట్ల రూపాయిలు మేర అన్నదాత సుఖీభవ నిధులు జమకాలేదని, వారిని గుర్తించి నిధులు మంజూరుచేసినట్లు తెలిపారు. రైతు సేవా కేంద్రాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఖరీఫ్, రబీలో వేయాల్సిన పంటలు, లాభసాటి, వాణిజ్య పంటలపై రైతులకు అవగాహన కల్పించేలా ఐదు రోజుల పాటు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ, డ్రోన్స్, వినూత్నమైన కార్యక్రమాలను అమలుచేసి రైతులకు మేలు చేసేలా ప్రధానాంశంగా తీసుకున్నట్లు తెలిపారు. డిసెంబర్ మూడో తేదీన ప్రతి రైతు సేవా కేంద్రం వద్ద సభ పెట్టి రైతులకు అవగాహన కల్పించడమే కాకుండా, రైతుల ఆలోచనను కూడా తీసుకోనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

పాడి పరిశ్రమకు జిల్లా అనుకూలమని, ఇక్కడ పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిందని అన్నారు. చిత్తూరు జిల్లా మాదిరిగా ఈ జిల్లాలో పాడి ఉత్పత్తి, మాంసం ఉత్పత్తులు పెంచడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో సరైన వసతులు లేక ఇటీవల విద్యార్ధులు అనారోగ్యం పాలైన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రతీ పాఠశాలలో విద్యార్ధుల సంఖ్యను బట్టి అవసరమైన టాయిలెట్లను మంజూరు చేసేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. గతంలో 270 మరుగుదొడ్లను మంజురుచేశామని, వాటిలో 170 పూర్తయ్యాయని, ఈ నెలాఖరులోగా మిగిలిన టాయిలెట్లను పూర్తికానున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి కొరకు 2017లో ఆర్.ఓ ప్లాంట్లను మంజూరు చేసామని, వాటిలో కొన్ని పాడయ్యాని, కొన్ని మరమ్మతులకు గురైయ్యాని అన్నారు. ప్రతీ పాఠశాలలో తాగునీటి ఏర్పాటుకై రూ.5 కోట్లు నిధులను మంజూరుచేసినట్లు మంత్రి స్పష్టం చేసారు. వీలైనంత త్వరగా టెండర్లను పిలిచి అన్ని పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటుచేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఆసుపత్రుల నిర్మాణాలన్నీ నిలిచిపోయాయని, ఆయా గుత్తేదారులతో మాట్లాడి మరో రెండు మాసాల్లో అన్ని ఆసుపత్రి నిర్మాణాలు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా కృషిచేస్తున్నట్లు చెప్పారు. మన్యం జిల్లాలో ప్రతీ గ్రామానికి అంబులెన్స్ వెళ్లాలని, ఇందుకు అవసరమైన రహదారులను రెండళ్లలో పూర్తిచేసేలా గతంలో నిర్ణయించుకున్నామని, ఇప్పటికి 100 గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించామని, మరో 170 గ్రామాలకు రానున్న ఏడాది కాలంలో అన్ని గ్రామాలకు రహదారులు నిర్మించి డోలీ మోతలు లేకుండా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియలో అటవీ శాఖ నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా అటవీ శాఖాధికారులకు మార్గదర్శకాలను జారీచేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో రెవిన్యూ సమస్యలకు శాస్వత పరిష్కారాన్ని సూచించేలా రెవిన్యూ క్లినిక్ పేరిట పరిష్కారం చూపిన జిల్లా కలెక్టరును అభినందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. కొంతమంది గృహాలు నిర్మించుకున్నప్పటికీ వాటికి పట్టాలు లేవని, వాటికొరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని, దానికి అనుగుణంగా రెగ్యులేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. జనవరి 26 నాటికి కుంకీ ఏనుగులు ఉండేలా అన్ని వసతులు కల్పించాలని జిల్లా అటవీ శాఖాధికారిని ఆదేశించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం సహకారంతో జిల్లాను ప్రగతిపథంలో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :