పార్వతీపురం/జియ్యమ్మవలస:పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు తన గళాన్ని వినిపించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరుని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని పలు కీలక సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ప్రధానంగా నియోజకవర్గంలోని మారుమూల గిరిశిఖర గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక గిరిజనులు పడుతున్న ఇబ్బందులను జయరాజు విప్ దృష్టికి తీసుకెళ్లారు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లాలన్నా, నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా డోలీ మోతలే దిక్కవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ గ్రామాలకు రోడ్లు మంజూరు చేయాలని కోరారు.
అటవీ ప్రాంతాల మీదుగా రోడ్ల నిర్మాణానికి సంబంధించిన అటవీ శాఖ అనుమతుల విషయమై కూడా వీరిరువురి మధ్య చర్చ జరిగింది. అటవీ నిబంధనల పేరుతో ఆగిపోయిన పనులను వేగవంతం చేయాలని, అలాగే గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిమ్మక జయరాజు కోరారు. గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, ఇతర మౌలిక వసతుల సమస్యలను కూడా ఆయన వివరించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ విప్, సంబంధిత అధికారులతో మాట్లాడి కురుపాం నియోజకవర్గ అభివృద్ధికి, గిరిజన గ్రామాల రహదారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తోటపల్లి మాజీ దేవస్థానం చైర్మన్ ఆగూరు వైకుంఠ రావు, ప్రజలు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.









