పార్వతీపురం మన్యం : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 5000 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన (మెయిన్) అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గమిడి సంధ్యారాణి వెల్లడించారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలతో, ప్రభుత్వ అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 217 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి (ప్రమోషన్) కల్పిస్తూ ఉత్తర్వులు అందజేశారు. చిరకాల కోరిక నెరవేరడంతో అంగన్వాడీలు ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడుకు, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఒకప్పుడు కేవలం రూ. 250గా ఉన్న అంగన్వాడీల గౌరవ వేతనాన్ని, మూడుసార్లు పెంచి రూ. 11,500 చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని గుర్తుచేశారు. అలాగే వారికి గ్రాట్యుటీ సౌకర్యం కల్పించి గౌరవప్రదమైన జీవితాన్ని అందించారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐసీడీఎస్ సేవలను విస్తృతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. పిల్లల పోషణ, ఆరోగ్యం, ప్రీ-స్కూల్ విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లలకు అందించే పౌష్టికాహారంలో ఎటువంటి రాజీ పడకూడదు. అంగన్వాడీ కేంద్రాలను తల్లిదండ్రులు సురక్షితమైన ప్రదేశంగా నమ్ముతున్నారు, కాబట్టి పిల్లలను ఆరోగ్యంగా, క్షేమంగా చూసుకుని ఇంటికి పంపే బాధ్యత టీచర్లదే. చిన్నారుల భద్రత దృష్ట్యా వారికి చిన్నప్పటి నుంచే ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’పై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. సమాజంలో వేళ్లూనుకుపోయిన బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హాజరైన వారితో బాల్యవివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జై పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టరలు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.










