- ప్రమాద రహిత జిల్లాగా కరీంనగర్‌ను తీర్చిదిద్దాలి: కలెక్టర్ పమేలా సత్పతి
- నివారణకు పోలీసు శాఖ తరఫున బహుముఖ వ్యూహం
- ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ ప్రమాద నివారణకు తారకమంత్రం
- బ్లాక్ స్పాట్ల గుర్తింపు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీపీ గౌష్ ఆలం.
కరీంనగర్ జిల్లా: రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, కేవలం అవగాహనతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ‘జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ’ సమావేశంలో పోలీస్ కమీషనర్ (సీపీ) గౌష్ ఆలం, ఇతర శాఖల అధికారులతో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీస్, మున్సిపల్, నేషనల్ హైవే, ఆర్ అండ్ బి, ఆర్టీసీ అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను వివరించారు. ఆయా చోట్ల అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమైన అనుమతులు, సహకారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. కరీంనగర్ జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు కూడా ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు.
పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ తరఫున ‘బహుముఖ వ్యూహం’ అమలు చేస్తున్నామని తెలిపారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్, వరంగల్, జగిత్యాల, సిరిసిల్ల, చొప్పదండి వెళ్లే మార్గాల్లో ప్రమాదాల తీవ్రత ఉన్న ‘బ్లాక్ స్పాట్లను’ గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యమే ప్రమాదాలకు ముఖ్య కారణాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డీజీపీ ప్రారంభించిన ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రమాదాల నివారణకు ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ (పరిసరాలను గమనిస్తూ నడపడం) తారకమంత్రం వంటిదని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలని, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయరాదని, పరిమితికి మించి వేగంతో వెళ్తే ‘స్పీడ్ గన్’ ద్వారా గుర్తించి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ సక్రమంగా పనిచేసేలా చూడాలని, పార్కింగ్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్టీవో శ్రీకాంత్ చక్రవర్తి, ఏసీపీలు విజయకుమార్, వెంకటస్వామి, శ్రీనివాస్, యాదగిరి స్వామి, నేషనల్ హైవే, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.










