కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మీడియా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత సముదాయంలో కంట్రోల్ రూమ్ లో మీడియా సెంటర్ ను గ్రామపంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు వి. శ్రీనివాస్, వ్యయ పరిశీలకులు బి.స్వప్న, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3 విడతలుగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. తొలి విడతలో 5 మండలాలలోని 27 కేంద్రాలలో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, జిల్లాలో 335 గ్రామపంచాయతీలు, 2 వేల 874 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 3 లక్షల 53 వేల 895 మంది ఓటర్లు ఉన్నారని, మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీల ద్వారా పత్రికలలో, టి. వి. లలో వచ్చే చెల్లింపు వార్తలు, వార్త కథనాలు, ప్రకటనలపై, సోషల్ మీడియా ప్రచారం పై నిఘా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక సంస్థలలో సమాచారం కొరకు కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నం.8500844365 లో సంప్రదించవచ్చని తెలిపారు.









