కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా/ కౌటాల : కౌటాల మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనంగా నాసిరకం అన్నం, నీళ్ల చారు వడ్డిస్తున్నారంటూ విద్యార్థులు శుక్రవారం రోడ్డెక్కారు. ప్రతిరోజూ ఇదే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాన రహదారిపై విద్యార్థులు ధర్నా చేపట్టి ఆందోళన వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించకపోవడంతో పాటు, ఉడకని అన్నం, నాణ్యత లేని చారు వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థుల ఫిర్యాదులపై విచారణ జరిపి, ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా తప్పక చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.









