కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ లో దొంగలు వేట మొదలుపెట్టారు. వారం రోజుల్లో జిల్లాలో మూడు చోట్ల చోరీలకు పాల్పడటంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కాగజ్‌నగర్ పట్టణంలో పట్టపగలే జరిగిన తాజా దొంగతనం స్థానికులను కలవరపరుస్తోంది. కాగజ్ నగర్ 14వ వార్డు, ద్వారకా నగర్‌కు చెందిన చిలుక వీరమ్మ అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. నంబర్‌ప్లేట్ లేకుండా వచ్చిన ఇద్దరు యువకులు మీ కుమారుడు పేపర్లు ఇవ్వమన్నాడని చెప్పి ఆమెను నమ్మబలికారు. ఇంట్లో మరెవరూ లేరని గమనించిన దొంగలు వీరమ్మపై చేయి చేసుకుని, బీరువాలను జల్లెడ పట్టారు. ఏమీ దొరకకపోవడంతో చివరికి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. వీరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుల కోసం వేలిముద్రలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలి రోజులుగా వరుస చోరీలు జరగడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు పోలీసు భద్రత పెంచాలని కోరుతున్నారు.









